3035 Jobs in TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)లో మూడు వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. సంస్థలో కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. కావున ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
తెలంగాణ ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని, గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవని, సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పరచుకొని కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని, జనవరి 31న ఉద్యోగాల భర్తీకి సంబంధించి శుభవార్త వస్తుందని గతంలో మంత్రి పొన్నం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు నెలల తర్వాత తాజాగా నియామకాల ప్రక్రియకు సంబంధించి కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి రాబోతున్నాయి. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.


Leave a Reply